అందాల పోటీల్లో ఫైనలిస్ట్, తెలుగులో కొన్ని ఆసక్తికర సినిమాల్లో.. అందులోనూ ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్ల సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఓ తార.. ఇప్పుడు ఏం చేస్తోంది? ఎక్కడ ఉంది? అనేది చాలామందికి అంతుపట్టని ప్రశ్నగా మారింది. ఆమె.. దీక్షా సేథ్! అందచందాల విషయంలో టాప్ హీరోయిన్లకు తీసిపోని, పర్ఫార్మెన్స్ విషయంలో తక్కువ చేయలేని దీక్ష 2009లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది.
ఆమె ఫొటోలు చూసిన డైరెక్టర్ క్రిష్.. తన 'వేదం' (2010) మూవీలో అల్లు అర్జున్ జోడీగా పూజ అనే క్యారెక్టర్‌తో నటిగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ సినిమా కమర్షియల్‌గా ఘన విజయం సాధించకపోయినా, విమర్శకుల ప్రశంసలను అమితంగా పొందింది. దీక్ష కూడా పూజ పాత్రలో బాగానే రాణించింది. ఆమె అందచందాలు పలువురిని ఆకర్షించాయి. ఆ వెంటనే హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన 'మిరపకాయ్' మూవీలో రిచా గంగోపాధ్యాయ్‌తో పాటు ఓ హీరోయిన్‌గా నటించింది.
'వాంటెడ్'లో గోపీచంద్ జోడీగా, 'నిప్పు'లో రవితేజ జోడీగా, 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' మూవీలో మంచు మనోజ్ సరసన కనిపించిన దీక్ష.. ఆ తర్వాత ప్రభాస్ సరసన 'రెబెల్' (2013) మూవీలో చేసింది. అందులో ఆమెది విషాదాంత పాత్ర. లారెన్స్ రాఘవ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తర్వాత అనూహ్యంగా మళ్లీ ఇంతదాకా మరో తెలుగు సినిమాలో కనిపించలేదు దీక్ష.
హిందీలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆమె చేసిన యత్నాలు ఫలించలేదు. 2014లో 'లేకర్ హమ్ దీవానా దిల్' మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా ఫ్లాపయింది. ఆ తర్వాత 2016లో 'జగ్గుదాదా' మూవీతో కన్నడ చిత్రసీమలో కాలుపెట్టింది. ఆ మూవీలో దర్శన్ హీరో. అదే ఏడాది వచ్చిన హిందీ చిత్రం 'సాత్ కదమ్' ఆమె చివరి చిత్రం. దాని తర్వాత దీక్ష సినిమాలకు దూరమైంది. గ్లామరస్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకున్న ఆమెను ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంకరేజ్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇప్పుడు ఆమె ఏం చేస్తోందో తెలీదు.